#Eid #Telangana #EidMubarak తెలుగు ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు! తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ముస్లింలు ఈదుల్ జొహా (బక్రీద్) పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముస్లిం అన్నదమ్ములకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ బక్రీద్ పండుగ త్యాగానికి,భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. కష్టసుఖాలను పంచుకుని పేదల పట్ల దయార్ద హృదయంతో ఉండటమే ఈ పండుగ యొక్క పరామార్ధం అని ఆయన తెలిపారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఇతరుల పట్ల సహనం, ఓపిక, తోటి వ్యక్తులను ఆదుకునే గుణానికి బక్రీద్ ప్రతీక అని అన్నారు. పేదల ఆకలి దప్పులను తీర్చడానికి త్యాగం చేయాలన్న సందేశం ఈ పండుగ యొక్క సారాంశం అని, మంచికి, మానవత్వానికి బక్రీద్ నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ఈదుల్ జొహా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరు ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకోవాలని కోరారు. మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్ వక్ఫ్ బోర్డు అధికారులు, ఈద్గాలు, దర్గాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోరారు.















