తెలంగాణలో ఉద్యమ గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు అందుకున్న జన వాగ్గేయకారుడు నిసార్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసి మంత్రి హరీశ్ రావు విషాదానికి లోనయ్యారు. తెలంగాణ పాటను సారవంతం చేసిన కళాకారుడు నిసార్ అని కీర్తించారు. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిసార్ తన పాటల ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ముస్లింలో కుటుంబంలో జన్మించిన నిసార్ అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువునిచ్చాడని కొనియాడారు. నల్లగొండ జిల్లా ఉద్యమ చైతన్యాన్ని ఆవాహన చేసుకున్న నిసార్ అంటూ ట్విట్టర్ లో స్పందించారు. ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణ జానపద సాంస్కృతిక కళా రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు అని హరీశ్ రావు అభివర్ణించారు. నిసార్ ఆలపించే 'పండు వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయె' అనే పాట 'తెలంగాణ ధూం ధాం' సభల్లో పెద్ద ఆకర్షణగా ఉండేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ జ్వాలా గీతం వంటి నిసార్ కు కన్నీటి నివాళి అర్పిస్తున్నామని పేర్కొన్నారు. నిసార్ కుటుంబానికి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.#nissarkhan https://www.instagram.com/p/CCYEHSYl7SY/?igshid=3v8ta4br07lq












