💐 దత్త జయంతి శుభాకాంక్షలు💐
దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు.
సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు.
ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో,
చంద్రుడు బ్రహ్మ అంశతో,
దుర్వాసుడు శివుని అంశతో
జన్మించారని పురాణ కథనం.
గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది.
ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదుఃఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు.
ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా,
ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది.
ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు.
ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
అతని సతీమణి అనఘాదేవి.
అనఘ అనగా పాపము లేనిది.
పాపము మూడు విధాలు...
మనసు తో,
బుద్దితో,
ఇంద్రియములతో,
మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ.
దత్తుని రూపంలో అంతరార్థం:
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో,
నాలుగు కుక్కలతో,
ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది.
వీటికి గల అర్థాలను పరిశీలిస్తే..
మూడు శిరస్సులు:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు,
ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
నాలుగు కుక్కలు:
నాలుగు వేదములు ఇవి.
దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
ఆవు:
మనసే మాయాశక్తి.
సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
మాల:
అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
చక్రము:
అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
డమరు:
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
కమండలము:
సమస్త బాధలను పోగొట్టును.
శుభములను సమకూర్చును.
దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తాత్రేయుని భక్తితో స్మరించినవారికి సమస్త పాపములు నశిస్తాయి.
దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది.
దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు.
తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా..
“అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ”
అనే పవిత్ర భావనతో,
భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు,
ఏదో ఒక రూపంలో వచ్చి,
రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.
శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని
21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది.
దత్తాత్రేయుడు మాయా ప్రభావితులై దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధనలకు,
ఆచారవ్యవహారాల అనుసరణకు,
ధర్మాధర్మ విచక్షణకు,
శిష్ట రక్షణతోబాటు,
మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే
దత్తుడు పెద్దపీట వేశాడు.
అందుకే ఆయన బోధగురువుగా మన్ననలను పొందారు.
దత్తావతార ముఖ్యోద్దేశం...భిన్నత్వంలో ఏకత్వసాధన.
అన్ని సాధనలను ఏకంచేసి,
తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం.
విష్ణువు ధరించిన అనేక అవతారాలలో ఎంతో సనాతన మైనది, విలక్షణమైనది దత్తావతారం.
కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని
ఒక్కొక్క యోగంగా మలచి,
వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి,
సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేస్తాడు.
సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహిస్తాడు.
దత్త సాంప్రదాయం సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని,
ముక్తిని సాధించవచ్చని తెలుపుతుంది.
దత్తునిది జ్ఞానతత్త్వం.
ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగ విద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు.
దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు.
అలాగే ప్రహ్లాదునికి ఆధ్యాత్మిక విద్య,
వశిష్టునికి యోగవిద్య,
పరశురామునికి శ్రీవిద్య,
కార్తవీర్యునికి ఆత్మవిద్య,
అలర్కునికి యోగవిద్య...
ఇలా ఎంతో మంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు.
ఇందులో సంతులు, సాధువులు, అవధూతలెందరో ఉన్నారు.
దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది.
ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమనాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది.
ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒకే సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు.
అందువల్ల దత్తజయంతి నాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది.
ఆ రోజు దత్తుని విశేషంగా పూజించినవారు
వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.
ఈ శ్లోకాన్ని..ఉదయం..మధ్యాహ్నం(12గంటల కు) సాయంత్రం 21సార్లు..పఠిస్తే...దత్త అనుగ్రహం కలుగుతుంది.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తా దత్తా శ్రీ గురుదత్తా..!!🙏
(సేకరణ)


















