Telangana turns the den of Bahujans!
-బహుజనీకరణ వైపు శరవేగంగా తెలంగాణ
-ఆగస్టు 9న గద్వాల కోట ఘడీలలో బహుజన మహిళల ధూంధాం
బహుజనుల బిడ్డలారా... తస్మాత్ జాగ్రత్త!: ఎన్నికల ముందు ఆధిపత్య వర్గాల ఆధీనంలోని రాజకీయ పార్టీల నేతలు ఆడే డ్రామాలు అనేకం!: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈసారి తెలంగాణ శాసన సభకు జరగబోయే సాధాకరణ ఎన్నికల్లో విభిన్న వర్గాల బాహుబలుల మధ్యనే రసవత్తరమైన పోటీ ఉండబోతోంది. ఈసారి గెలుపు మాదంటే మాదే అని ఇటు అధికార పార్టీ… అటు ప్రతిపక్షపార్టీలు ఎవరికి వారు ధీమాను బాహాటంగా చెప్పుకుంటున్నా...లోలోప ఎవరి బలం ఎంత అని కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు తమ సొంత సర్వేలు చేయించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే మాకు అలాంటి సర్వేలపై ఆధారపడాల్సిన అవసరం లేదు… మాకు ప్రజల్లో ఉన్న ఆధరణ, వారి ప్రేమాభిమానాలు, మా బలం ప్రజాబలం అన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధినేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఆదివారం సుందరయ్య విజ్జ్ఞాన కేంద్రంలో బహుజనుల విద్యావంతుల ఆధ్వర్యంలో మేధోమథనం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బహుజనుల బిడ్డలకు చదవుతోపాటు ఇటు ఆధిపత్య వర్గపు పాలకులు చూపించే వివక్ష, చిన్నచూపు వారిని వారి ఉన్నత ఆశయాల వైపు నడిపించే చదవు నుంచి వెనక్కునెట్టివేస్తోందన్నారు ఆరెస్పీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న, బహుజన పిల్లలు అధికంగా చదివే సాంఘీక సంక్షేమ పాఠశాలలు, స్తుర్భాలలో ఏం జరుగుతోందో ఈ సమాజం గమనిస్తోందన్నారు. గురుకుల ఆశ్రమ పాఠశాల్లో పురుగుల అన్నం, కలుషిత నీరు తాగి వాంతులు విరేచనాలతో మన బహుజన పిల్లలు వేదనకు గురవుతున్నారని తెలియజేశారు. మన బహుజన విద్యార్థుల చదువులపై ఈ పాలకుల తీరు దీనికి అద్దం పడుతుందన్నారాయన. బహుజన విద్యార్థులతోటే ఈ సమస్యపోలేదన్నారు. తాను ఈ మధ్య తన స్నేహితుడు పిలిచిన ఒక వేడుకకు వెళ్లానని... ఈ వేడుకల్లో నాతోపాటు మా ఫ్రెండ్ దిగిన ఫోటోను చూపిస్తూ… ఈ సో కాల్డ్ అధికార పార్టీ నాయకులు, అధికారులు.. అతను ఆరెస్పీతో కలుస్తున్నాడని బెదిరించి తన విధులకు ఆటంకం కలిగించారని వాపోయారు. ఇలా ప్రతి బహుజన విద్యార్థి, వివిధ పార్టీలలో పనిచేస్తున్న బహుజనులు, ప్రభుత్వంలో పని చేస్తున్న నాయకులు, అధికారులు ఎంతో మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇదిగో అందుకనే మన రాజ్యం మనకు కావాలి. ఇది మన భూమి, మన రాజ్యం, మన బతుకులు. ప్రగతి భవన్ అందరిదీ అన్నారు. ఈ తెలంగాణ కొందరు దొరల గఢీలలో బందీ అయిందన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో తాను 110 రోజులుగా బహుజన రాజ్యాధికార యాత్రలో ఎండనకా, వాననకా గడప గడపకు తిరుగుతూ… బహుజనుల సమస్యలు తెలుసుకుంటున్నానని వారి సమస్యలు ఒకటి కాదు అనేకం అన్నారు. కొందరు ఫించన్ ఇస్తలేరు బిడ్డా అంటే, మరొకామె డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదన్నారు. ఇంకొకాయన తన భూమి లాక్కున్నారని వాపోయారని తెలియజేశారు. బహుజన రాజ్యం వస్తేనే వీరి సమస్యలు తీరుతాయన్నారు.
మాజీ ఓ ఎస్ డీ ఎన్ ఎస్ సాహు మహరాజ్ రాజ్యాంగాన్ని పిటిష్టంగా అమలు పరిస్తే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కాదని… చట్టాలను, పథకాలను సరిగా అమలు పర్చకుండా మనకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేడు దళిత, గిరిజన, బీసీ బహుజనులు రోడెక్కాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని అన్నారు.
ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏపరిస్థితుల్లో ఉందో కనుక్కుందామని వెళితే అరెస్టులు చేస్తున్నారని, తెలంగాణలో విద్యకు నిధులు చాలా తక్కువగా ఖర్చుపెడుతున్నారని, కేజీ టు పీజీ విద్యను తొంగలో తొక్కారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకురాలు, ప్రముఖ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి బహుజన మహిళల రాజ్యం కోసం తాము కూడా పోరాడుతున్నామన్నారు. ఇవాళ తెలంగాణ సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. దళిత మహిళలపై విద్యాసంస్థల్లోనూ, స్కూళ్లు, కళాశాలల్లో, యూనిర్సిటీలలోని తోటి అధ్యాపకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. దళిత ఇటు మానవ హక్కుల కమిషన్ గానీ, అటు మహిళా కమిషన్ గానీ దళిత మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాయని, కనీసం వారు సుమోటోగా కళ్లకు కనబడుతున్న అన్యాయాన్ని ప్రశ్నంచలేకపోతున్నారని అన్నారు. అందుకని బహుజన రాజ్యంలో దళిత మహిళలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో డా జిలుకర శ్రీనివాస్, ప్రొఫెసర్ లింబాద్రి, డా. తిరుపతయ్య, బహుజన మేధావులు, విద్యార్థులు పలు బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
-వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్, గద్వాల్



















