సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడిన మోదీ: ఎం.కె.స్టాలిన్ రాఫెల్ ఒప్పందంపై జరిగిన చర్చల్లో ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో నేరుగా చర్చలు జరిపిందని, దీనిపై రక్షణ శాఖ సైతం అభ్యంతరం చెప్పిందంటూ ఓ జాతీయ దినపత్రిక వెలువరించిన కథనంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ స్పందించారు. రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) డిసెంట్ నోట్‌తో సుప్రీంకోర్టు ధిక్కారానికి ప్రధాని పాల్పడినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో పీఎంఓ సంప్రదింపులు జరిపినట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన సీల్డ్ కవర్లో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలను ఒక ప్రధాని ఎదుర్కోవడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ సంభవించలేదని స్టాలిన్ నిప్పులు చెరిగారు.కాగా, సమయానుకూలంగా ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీయడాన్ని ప్రత్యక్ష జోక్యంగా భావించరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. యూపీఏ హయాంలో అప్పటి జాతీయ సలహా మండలి చైర్మన్ సోనియాగాంధీ తరచు పీఎంఓ కార్యాలయాన్ని పర్యవేక్షించే వారని, అది జోక్యం చేసుకోవడం కాదా అని ప్రశ్నించారు. Tags:rafel,dmk leader,mk stalin,fire on modi,supreme court











