I was passed in studies.. but failed to get job?
ఈ వార్త నాదే: నాకు ఇక ఈలోకంతో పనిలేదనిపిస్తోంది?
- నిరుద్యోగంతో అలసిపోయి, ఇల్లు గడవక భార్యపై చేయి చేసుకున్న పరిస్థితి!
నేను ఒక నిరుద్యోగిని. గత 15 ఏళ్లుగా జర్నలజం వృత్తినే నమ్ముకున్నాను. గత ఐదేళ్లుగా జాబ్ లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను. జర్నలిస్ట్ గా నా సంపాదన శూన్యం. బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బు సంపాదించలేను. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోదు. మీడియాలో జాబ్ కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటికీ ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గత రెండేళ్ల క్రితం నా సొంత ఊరు పచ్చర్ల గ్రామం, రాజోళి మండలం, జోగులాంబ జిల్లాలో వచ్చి బతకడానికి ప్రయత్నిస్తున్నాను. నా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి, ఉపాధి హామీలో కూలీగా బతుకుతున్నా.. నా భార్యాపిల్లను సాకలేని దుర్భర పరిస్థితి నాది. ఒక చిన్న కియోస్క్ బ్యాంకు (ఏయిర్ టెల్ బ్యాంకు) పెట్టినా... నా దగ్గర అది నపడానికి కూడా చేతిలో ఒక చిల్లి గవ్వ లేదు. పిల్లల తినుబండారాల షాపుతోనే ఇంట్లో కూరగాయలకు నడుస్తోంది. రేషన్ బియ్యంతోనే మా కడుపు నింపుకుంటున్నాము. నేను నా జీవితంలో ఓడిపోయాననిపిస్తోంది. నాతోటి క్లాస్ మేట్ లు మీడియాలో మంచి పొజిషన్ లో ఉన్నారు. నా చేతకాని తనం వల్ల నేను వారిలా ఎదగలేకపోయాను. జర్నలిజంలో పీజీ చేసినా నేను దాన్ని వినియోగించుకోలేని అసమర్ధునిగా జీవిస్తున్నాను. ఇవాళ నా పిల్లలు డాడీ స్కల్ ఫీజు కట్టాలంట అని అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఆ పసి హృదయాలకు మీ డాడీ ఒక చేతకాని వాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నాది. డబ్బులు సంపాదించలేని నీవేమి భర్తవు అని నా భార్య అన్నా ఏమీ సమాధానం చెప్పలేని స్థితిలో నేను ఉన్నాను. నా ఈ స్థితికి కారణం నేనే అని భావిస్తున్నాను. ఇద్దరు ఆడపిల్లలు అడిగినవి ఇప్పించలేని నిస్సహాయున్ని.. ఇటు బోయలను ఎస్టీలో చేర్చే ఉద్యమంలో ఫెయిల్, సంసార బాధ్యతలో ఫెయిల్, ఒక తండ్రిగా ఫెయిల్, ఒక భర్తగా ఫెయిల్ అయ్యానని పిస్తోంది, అవసరం వచ్చినప్పుడు హైదరాబాద్ లో అంగన్ వాడీ హెల్పర్ గా పని చేస్తున్న నా తల్లినే అప్పుడప్పుడు అడుక్కునే పరిస్థితి. నేను జీవితంలో ఎదగడానికి నా ప్రయత్నం మానేయలేదు. గత నాలుగేళ్లలో పెళ్లిల్ల బ్రోకర్ గా మారాను, చిన్న వ్యాపారస్థుడిగా మారాను, బ్యాంకు రిటేలర్ గా మారాను, పైసా సంపాదించలేని జర్నలిస్టుగా ప్రస్తుతం ఉన్నాను. నా తల్లి నిందించింది, భార్య నిందించింది, చివరికి నా పిల్లలు కూడా ఎప్పుడు డబ్బులు లేవు అంటావు అన్నా... జీవితంలో నేను రాణించలేకపోవడానికి దేవున్ని నిందించను. ముమ్మాటికి నా చేతకాని తనమే. ఒక చావు తప్ప అన్ని అనుభవిస్తున్నాను. అయినా నా ప్రయత్నం ఆపలేదు. కొందరు గేలి చేశారు, వీడేం సాకుతడు అన్నారు. అప్పు అడిగినా ఏమి చూసి ఇస్తారు... పెద్ద ఆస్తుపాస్తులు లేవు ఒక రేకుల ఇల్లు తప్ప. బహుశా నాకు బతకడం రాదు కాబోలు.
నేను చాలా సార్లు దీర్ఘంగా ఆలోచించాను ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను అని ఈ సమాజంలో మంచితనం పినికి రాదు అని అర్థమయింది. నిజం చెబితే నమ్మరు. ప్రతి పనిలోనూ అవినీతి రాజ్య మేలుతుంది. ఒక హాస్పిటల్ కు వెళ్లినా, మండలాఫీసుకు వెళ్లినా, పంచాయితీ ఆఫీసుకు వెళ్లినా, కలెక్టర్ ఆఫీసుకు వెళ్లినా, ఉద్యోగనియామకాల్లోనూ అదే పరిస్థితి. నా క్లాస్ మేట్ నేను ఒకసారి ఒక జిల్లా కోర్టులో రికార్డు అసిస్టెంట్ జాబ్ కు దరఖాస్తు చేసుకున్నాము, మధ్యవర్తుల ద్వారా మూడు లక్షల లంచం అడిగారు. వాడు కట్టాడు, నేను కట్టలేకపోయాను. వాడికి జాబ్ వచ్చింది నాకు రాలేదు. నా డిగ్రీ చేస్తున్న సమయంలో అమీర్ పేట్ లో ఒక చెప్పుల షాపులో పనికి వెళ్లాను. ఆ యజమాని చెప్పులను అసలు ధరకు బదులు రెట్టింపు ధరకు అమ్మడం నాకు నచ్చలేదు. అది అడిగినందుకు నన్ను రెండ్రోజులు షాపులోని చెప్పులన్ని నేను నాతోపాటు మరొకడికి సేల్స్ మెన్ నుంచి కడిగే స్థాయికి దింపి పని అయిపోయాక పని చేసిన రోజుల కూలి ఇచ్చి ఇంటికి పంపాడు. ఒక కిరాణ షాపు కాన్నుంచి ప్రతి షాపులోనూ వ్యాపారంలోనూ మోసాన్ని వ్యాపారంలో టెక్నిక్ అని చెప్పే వాళ్లను చూశాను. చివరకి నేను ఈరోజు నా ఊళ్లో పెట్టిన పిల్లల తినుబండారాలు కూడా రెండు రూపాయలకు నాలుగు సొంగలు అమ్ముతున్నానని పక్క షాపు వాళ్లు నీవు అలా అమ్మితే ఎలా? అని నన్నే దబాయించే పరిస్థితి. నేను వారిలా మోసం చేయనందుకే నేను ఎదగలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. నేను ఒకసారి ఒక పెద్దాయన దగ్గరకు వెళ్లి సార్ నేను జాబ్ లేక ఇబ్బందుల్లో ఉన్నాను నాకు ఉద్యోగం ఇవ్వండి అని నిజాయితీగా అడిగితే వాళ్లు నవ్వే పరిస్థితి. బతుకుదెరువు ఇవ్వండని అడిగితే పట్టించుకునే వాళ్లు లేరు. నాకు పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేదు. కష్టాల్లో కూడా గుండె రాయి చేసుకొని నెట్టుకొస్తున్నాను. నా పిల్లలకు బర్త్ డే కు నా దోస్తు రూ. 500 బట్టలకని ఇస్తే.. అవి ఇంట్లో పెరిగిన వంటనూనె ప్యాకెట్టుకు సరిపెట్టు కోవల్సి వచ్చింది.
నా మీడియా అనుభవంలోనూ ఇదే పరిస్థితి. ఇసుక మాఫియా గురించి రాస్తే బెదిరింపులు, అనుకూలంగా రాస్తే డబ్బులు, అంటే మనం ఇక్కడ వాస్తవాలను ప్రజలకు అందిస్తే తప్పు, ఒక నిజాన్ని నిర్భయంగా రాసే రోజులు కావు ఇవి. ఇలా ఎంతమంది మోసపోతున్నారో? ఎన్ని కోట్ల అవినీతి జరుగుతుందో? నిన్ననే ఒక ఎలక్ట్రికల్ డీఈ దగ్గర 100 కోట్లు డబ్బు, అంతకు ముందు ఒక తాశిల్ధార్ దగ్గర కొన్ని వందల కోట్ల డబ్బు ఎక్కడకు పోతుంది ఈ సమాజం. నీతికి విలువ లేదు. నిజాయితీకి విలువ లేదు. ఫోను కొనివ్వలేదని సొంత తల్లినే చంపుకున్న ఒక కొడుకు, ఆస్తుల తగాదాలో సొంత అన్న, వదిన, పిల్లలను నరికి చంపుకుంటున్నారు. ఒక తండ్రి బిడ్డపై అఘాయిత్యం, ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఒక ఆడపిల్ల బయటికి వెళ్లాలంటే భయం, ఒక బంగారు గొలుసు మెడలో వేసుకొని బయటికి వేళ్లే పరిస్థితి లేదు. నిజంగా కష్టపడ్డ వాడికి మిగిలేదు సున్న, మోసం, అన్యాయం, ఒకరిని అణగదొక్కి బతకడం నా వల్ల కావటం లేదు. పైకి రావాలంటే కిందివాన్ని అణగదొక్కాల్సిందే అనే నానుడి నిజంగా పాటిస్తుంది ఈ సమాజం. దీన్ని బతుకు పోరాటం అంటున్నారు. మృగాలకు, మనుషులకు తేడా ఒకటే.. వాటికి మనస్సాక్షి ఉండదు. మనిషికి ఉన్నా... ఆ మనస్సాక్షిని చంపుకొని కొందరు, అమ్ముకొని కొందరు, నమ్ముకొని కొందరు జీవిస్తారు. నేను మూడోరకం వాన్ని.
ఇదంతా నేనేదో మంచివాన్ని, సమాజాన్ని నేనొక్కన్నే ఉద్దరిస్తున్నాను అని నేను చెప్పడం లేదు. ఎంతోమంది నిజాయితీ పరులు ఉన్నారు. ఎంతో మంది సమాజ సేవకులు ఉన్నారు. నాకు రూట్ తెలియదు. ఇటు కుటుంబంలోగాని , కులంలోగాని, సమాజంలో నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. నిజం నిక్కచ్చిగా అందించే ఒక చానల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. వాళ్లు 3 సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు లేక ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల రెకమెండేషన్ లెటర్లు అడిగారు. ఒకటి అయ్యింది. ఇంకా రెండు లెటర్ల కోసం తిరుగుతున్నాను. సిఫార్సు లేఖలు కూడా పొందలేని నిస్సహాయత నాది.
- వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్, జోగులాంబ గద్వాల్ జిల్లా, సెల్ 9391204009














