కవిత్వం రాయలేక పోతే కనీసం కవితగానైనా బతకాలి!
కవిసంగమం: ఇక్కడ కవిత్వంతో కడుపునిండుతుంది!
మన సమాజంలో మానవీయ విలువల్ని, సామాజిక ప్రమాణాల్ని అనుసరిస్తూ ఇతరులు వాటిని అనుసరించేలా చేయడం కవిత్వ లక్ష్యణం అన్నారు జూకంటి జగన్నాథం. అబిడ్స్ లోని గోల్డెన్ త్రిషోల్డ్ లో శనివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమయి రాత్రి 9:30 దాకా నడిచింది. దీనికి వివిధ జిల్లాల నుంచి కవితాప్రియులతో పాటు తోపుడుబండి వ్యవస్థాపకుడు సాధిక ఆలీగారు ఇంకా మరికొందరు హాజరయ్యారు. కవిసంగమం - 26వ కవిత్వ పఠన సమావేశానికి జోగంటి జగన్నాధం అధ్యక్షత వహించగా యాకుబ్ మార్గదర్శం వహిస్తూ కవిసంగమం - ఫేస్బుక్ గ్రూప్ వచనకవిత్వం గురించి, కవిత్వసృజన,సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రముఖ కవి, కవిసంగమం గ్రూప్ అడ్మిన్ యాకుబ్ సాహెబ్ అన్నారు.
మూడు తరాల కవులు తొలితరం, మలితరం, నేటి ఆధునికతరం (ప్రాంతీయ, లింగ, వయసు భేదాలు లేకుండా కవిత్వానికి పెద్దపీఠ వేస్తూ) ముచ్చటగా ఫేస్ బుక్ లో ఏర్పాటు చేసుకున్న గొప్ప వేదికే కవిసంగమం. ఆధునిక యువ కవులకు కవిత్వం ఎలా రాయల్లో మెలకువలు, అనుకువలు నేర్పుతూ గత కొన్ని యేండ్లుగా కవిత్వప్రియులకు చక్కటి వేదికను ఏర్పాటు చేశారు కొంతమంది మేధావులు జూకంటి జగన్నాధం, అరటి క్రిష్ణ, యాకుబ్ మొదలగు వారి చొరవతో నేటి తరం కవులు సత్యగోపి, వైష్ణవి శ్రీ, సిద్దార్థ్ కట్టా వచన కవిత్వాలను పరిచయం చేశారు. వారు అధ్భుతమైన కవితలతో సభికులను మెప్పించి వారి కరత్వాల ధ్వనులకు దాసోహమయ్యారు.
వాటిలో మచ్చుకు కొన్నిలైన్లు...
ఇప్పుడు పరిస్ధితి ఎలా ఉందంటే?
ఆకాశంలో గంగ
గింగిరులు కొడుతున్నప్పుడు
భయం భయంగా
తల్లికోడి రెక్కల క్రింద
తలదాచుకున్నట్లుగా ఉంది - జూకంటి జగన్నాధం
దారితప్పి ప్రపంచంలోకి వచ్చినట్లనిపిస్తుంది
మనుషులతో పురాతన బంధమేదీ స్ఫురించదు
అందరూ నిగూఢమైన రహస్యాలు దాచుకున్న
ఏకాంత ద్వీపాల్లా కనిపిస్తారు - అరటి క్రిష్ణ
అందరూ వెళ్ళిపోయాక
నిశ్శబ్దాన్నే అణ్వాయుధంగా విసుర్తాయి గోడలు
వరండాలోని చెట్లన్నిటికి జీవమొచ్చి
ఆకులను కప్పుకుని వొంగి వొంగి వేర్లతో ఇంటిలోపలికి నడిచొస్తాయి
నీళ్ళన్ని నృత్యం చేస్తుంటాయి గాలిపాటకి
బల్లమీది కాఫీకప్పు నురగలు నురగలుగా దగ్గుతుంది గుర్తించరేమోనని
పుస్తకాలన్ని చనిపోయినట్టు నటిస్తుంటాయి
మనిషిలేకుండా పోవడమంటే లేకపోవడమనే అనుకుంటా - సత్యగోపి
గుండెలో తడిని కాస్తైనా మిగుల్చుకుంటే
పచ్చదనాలన్నీ కనుమరుగయ్యేవి కావంటూ
మండీ మండీ ప్రకృతితో పాటు
మనుషుల గుండెలూ ఎండుతున్నాయి..
ఎండుతూనే ఉంటాయి.. - వైష్ణవి శ్రీ
నాన్నిచ్చిన నోట్ల పై గాంధీ ఉండటం బానే ఉంది గానీ
నాన్నుంటే ఇంకెంత బాగుండేదో ....
తూకంలో నాన్నే కూర్చుంటాడు అమ్ముకోవాల్సొచ్చినప్పుడు...
తనని తానే కాల్చుకుంటాడు వెలుగవ్వాల్సినపుడు ...
ఎవరున్నారు నాన్న ? ఇది మేల్ సుపీరియారిటీ సొసైటీ అని...
నిన్ను చూసాక మాత్రం నాకిది ఫాదర్స్ సాక్రిఫైస్డ్ సొసైటీ - సిద్దర్థ్ కట్టా
యాకుబ్ అండ్ టీం ఆధర్వర్యంలో కవిసంగమం గంపెడు కవులతో వేలమందికి కాదు అక్షలమంది యువ కవులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం!